రహదారిపై పాడి కౌశిక్ రెడ్డి ఆందోళన
జీ న్యూస్ హుజూరాబాద్
హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గురువారం కరీంనగర్–వరంగల్ రహరారిపై ఆందోళన చేపట్టారు. వీణవంక మండల కేంద్రంలో నిర్వహిస్తున్న సమ్మక్క సారలమ్మ జాతరకు తన కుటుంబ సభ్యులతో కలిసి ఈరోజు సాయంత్రం బయలుదేరిన ఎమ్మెల్యేను, ఆయన క్యాంపు కార్యాలయం (కేసీ క్యాంప్) వద్దే పోలీసులు భారీ బందోబస్తుతో నిలిపివేశారు. కరీంనగర్ సీపీ ఆదేశాల మేరకు ఈ చర్యలు తీసుకుంటున్నామని పోలీసులు చెప్పారు. భక్తిభావంతో మొక్కులు చెల్లించుకోవడానికి వెళ్తున్న తనను, తన కుటుంబ సభ్యులను ఎందుకు అడ్డుకుంటున్నారని ఎమ్మెల్యే పోలీసులను నిలదీశారు. పోలీసుల తీరుకు నిరసనగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కరీంనగర్ -హన్మకొండ ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నాకు దిగారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ కార్యకరలు, నాయకులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకోవడంతో పోలీసులకు, నిరసనకారులకు మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. పోలీసుల వ్యతిరేకంగా కార్యకర్తలు నినాదాలతో హోరెత్తించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రజాప్రతినిధికి కనీసం జాతరకు వెళ్లే స్వేచ్ఛ కూడా లేదా అని కౌశిక్ రెడ్డి మండిపడ్డారు. పోలీసు యంత్రాంగం అధికార పార్టీకి తొత్తులుగా మారి ప్రతిపక్షాలను వేధిస్తోందని ఆయన ధ్వజమెత్తారు. శాంతిభద్రతల పేరుతో భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్న జిల్లా సిపినీ వెంటనే సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మేము అధికారంలోకి వచ్చాక ఒక్కొక్కరి సంగతి చూస్తామంటూ పోలీసులకు పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశారు. ఎమ్మెల్యే నిరసనతో ప్రధాన రహదారిపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు భారీగా మోహరించి పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. ఎమ్మెల్యే పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు, పోలీసుల పట్ల ఎమ్మెల్యే దురుసు ప్రవర్తన సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొంతసేపటి తర్వాత వీణవంకకు వెల్లడానికి పోలీసులు అనుమతినివ్వడంతో ఎక్కడి వారు అక్కడకు వెళ్లిపోయారు. కాగ వీణవంక వెల్లిన పాడి కౌశిక్ రెడ్డి సమ్మక్క–సారలమ్మ జాతర వద్ద హంగామ చేయటంతో శాంతి భద్రతలకు భంగం వాటిల్లేలా కనిపించడంతో పోలీసులు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని అదుపులోకి తీసుకొని కరీంనగర్ తరలించారు.
