ఆత్మబలిదానాలు వద్దు…..ఓపికతో కొట్లాడుదాం…

Must read

ఆర్టీసీ కార్మికులకు న్యాయం చేయాలి
ప్రభుత్వం తక్షణం స్పందించాలి….

ఆత్మబలిదానాలు సరికాదు 

మానవ హక్కుల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్.తిరుపతయ్య

జీ న్యూస్​ హుజూరాబాద్​

ఆర్టీసీ కార్మికులు న్యాయమైన డిమాండ్లకోసం చేస్తున్న ఉద్యమంలో ఆత్మబలిదానం చాలా బాధకరమని, ఆత్మబలిదానాలు వద్దని ఓపికతో కొట్లాడి డిమాండ్లను సాదించుకుందామని మానవ హక్కుల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్.తిరుపతయ్య అన్నారు.  తెలంగాణ ఆర్టీసీ కార్మికులు నిరోధికంగా సమ్మె చేస్తున్న నేపథ్యంలో శుక్రవారం మానవ హక్కుల వేదిక బృందం కరీంనగర్ జిల్లా, హుజురాబాద్ డిపో కార్మికులు నిర్వహించిన ఊరేగింపులో పాల్గొని, అనంతరం డిపోలో తిరిగి సమావేశమైన కార్మికులను ఉద్దేశించి మాట్లాడి తన మద్దతును తెలియజేసింది. ఈ సందర్బంగా మానవ హక్కుల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్.తిరుపతయ్య మాట్లాడుతూ తక్కువ వేతనం, ఉద్యోగ అభధ్రతల మధ్య కార్మికులతో పని చేయిస్తూ, ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులను మానసిక శారీరక ఒత్తిడికి గురి చేస్తున్నదని ఆవేదన వ్యక్లం చేశారు. కార్మికుల ఉమ్మడి శ్రమ, అంకితభావాలతో వచ్చే మంచి ఫలితాలను ప్రభుత్వం తన గొప్పగా చెప్పుకుంటూ, సంస్థ ఆర్థిక నష్టాలకు కార్మికులే బాధ్యులన్నట్టు ప్రవర్తిస్తుండటం తగదన్నారు. నిజానికి సంస్థ ప్రయాణికులకు అందించే సమయ పాలన, రోడ్డు భద్రత, మహిళల భద్రత వంటి గొప్ప సేవలు కార్మికుల శ్రమ, నిజాయితీల కారణంగా సంస్థ ఆర్థిక పురోగతిలో ఉందన్నారు. సంస్థ ఆర్థిక నష్టాలకు ప్రభుత్వాలు ప్రయాణికులకు అమలు చేసే వివిధ సంక్షేమ పథకాలకు తగిన సమయంలో సంస్థకు డబ్బులు చెల్లించకపోవడం, బస్సులను ఆధునికరించకపోవడం వలన కార్మికులు గోస పడుతున్నారన్నారు.
2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు, వారి పాలనా కాలం సగం పూర్తయినా, అమలు ప్రారంభం కాకపోవటం సరికాదన్నారు. ఈ నేపథ్యంలో జరిగే వారి సమ్మె ప్రజాస్వామ్య బద్ధమైనదని. వారి డిమాండ్లు న్యాయమైనవేనన్నారు. ప్రభుత్వం వెంటనే వారితో మాట్లాడి సంస్థ పరిరక్షణకు, కార్మికుల హక్కులకూ, సంక్షేమానికీ కట్టుబడి తన విధానాల్ని రూపొందించడమే కాకుండా, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్​ చేశారు.
దాటవేత విధానాల్ని, అణచివేత విధానాల్ని అవలంబించడం ప్రజాస్వామ్య విధానాలు కావన్నారు. ఎన్నికల్లో లబ్ధి పొంది, ఎన్నికల హామీలను అమలు పర్చాల్సిన అవసరం లేదన్నట్టు వ్యవహరించడం సరికాదని, ప్రభుత్వం వెంటనే, కార్మిక నాయకులతో మాట్లాడి, వారి న్యాయమైన డిమాండ్లను నెరవేర్చి, ఆందోళనను విరమింప చేయాలని కోరారు.
కార్మికులు కూడా క్షణికావేశంలో ఉద్యమ సమయంలో ఆత్మ బలిదానాల విధానాన్ని మానుకోవాలని కోరారు. ఏ సమస్యనైనా తక్షణ పరిష్కారాలు, దీర్ఘకాలిక పరిష్కారాల నేపథ్యంలో చూస్తూ సమిష్టిగా ఎదుర్కోవాలి కాని, ఆత్మబలిదానాలు వంటి నిర్ణయాలు సరికాదని, ఓపికతో కూడిన సమిష్టి పోరాటమే అన్నిటికీ పరిష్కారం లబిస్తుందన్నారు. కార్మికులతో ఊరేగింపులో పాల్గొని, ఉద్యమ శిబిరాన్ని సందర్శించిన మానవ హక్కుల వేదిక బృందంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్ తిరుపతయ్య , కరీంనగర్ జిల్లా మానవ హక్కుల వేదిక నాయకులు గోశిక మధు, ఎస్. అచ్యుత్ కుమార్, ఇంజం చైతన్య లు ఉన్నారు.

More articles

Latest article