- సాహితీ ప్రపంచంలో వారు చిరస్మరణీయులు
ఆరుద్ర స్మారక తపాలా బిళ్ళ ఆవిష్కరణ కార్యక్రమంలో
మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు
జీ న్యూస్ హైదరాబాద్
కవి జంటగా ఆరుద్ర, రామలక్ష్మి దంపతులు తెలుగు సాహితీ ప్రపంచంలో చిరస్మరణీయంగా నిలుస్తారని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు అన్నారు. ప్రముఖ కవి, సాహితీవేత్త, పరిశోధకుడు ఆరుద్ర శత జయంతి సందర్భంగా హైదరాబాదు హోటల్ దసపల్లాలో మంగళవారం ఆయన స్మారక తపాల బిళ్ళ ఆవిష్కరణ కార్యక్రమంలో ముప్పవరపు వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. వారసత్వం అంటే ఆస్తులు, పదవులు పంచుకోవడం కాదని, పెద్దలు చూపించిన మార్గాన్ని, వారి ఆలోచనలను భవిష్యత్ తరాలకు మరింత మెరుగైన మార్గంలో అందజేయడమే నిజమైన వారసత్వం అనిపించుకుంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పోస్ట్ మాస్టర్ జనరల్ శ్రీమతి వీణా కుమారి, ఆరుద్ర కుమార్తె శ్రీమతి కవితా చింతామణి, మనవడు గౌతమ్ చింతామణి, సాహితీవేత్త లగడపాటి సంగయ్య సహా పలువురు సాహితీ ప్రముఖులు ఆరుద్ర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ… “తెలుగు సాహితీ, సినిమా ప్రపంచానికి “ఆరుద్ర”గా కలం పేరుతో సుపరిచితులైన శ్రీ భాగవతుల సదాశివ శంకరశాస్త్రి శతజయంతి సందర్భంగా ఆయన స్మృతికి నివాళిగా స్మారక తపాల బిళ్ళను విడుదల చేయడం ఆనందదాయకం అన్నారు.చొరవ తీసుకుని ఆరుద్రకు సముచిత గౌరవాన్ని కల్పించిన పోస్టల్ విభాగానికి అభినందనలు తెలిపారు. ఆరుద్ర గ్రంథాలయాలపై చూపిన మక్కువను వెంకయ్య నాయుడు ప్రస్తావిస్తూ గ్రంథాలయాలను సమాజంలో వెలుగునిచ్చే జాగృత జ్యోతులు గా అభివర్ణించారు. “గ్రంథాలయం ఒక సజీవ మూర్తి. ఒక చైతన్య స్రవంతి. మన చరిత్రలో, సంస్కృతిలో, జాతీయ సంపదలో ఒక ముఖ్య భాగంగా గ్రంథాలయాలు విలసిల్లాయి. స్వరాజ్య ఉద్యమ కాలంలో ప్రజలను మేల్కొలిపే జాగృత జ్యోతులుగా వెలుగొందాయి.” అని చెప్పారు. మెదడును చైతన్యం చేయడానికి పుస్తకాలు అత్యంత ముఖ్యమైనవని, పిల్లలకు పుస్తక పఠనం అలవాటు చేయాలని సూచించారు. “ప్రతి పల్లెకూ గ్రంథాలయం, ప్రతి ఇంటికి స్వచ్ఛాలయం (శౌచాలయం) నినాదం కావాలి” అని ఆకాంక్షించారు.

ఆరుద్ర “సమగ్రాంధ్ర సాహిత్యం” తెలుగు సాహితీ చరిత్రకు దిశను, దశను చూపెట్టిందని వెంకయ్యనాయుడుఅన్నారు. “కూనలమ్మ పదాలు” సరదాగా ఉంటే, “త్వమేవాహం” లోతైన సాహితీ దర్శనంగా ఉంటుందని,ఒకే వ్యక్తి ఇన్ని రకాలుగా రచన చేయడం అరుదైన అంశమని అన్నారు. ఆరుద్ర కలం నుంచి జాలువారిన “శ్రీరామ నామాలు శతకోటి…” వంటి భక్తి గీతాల్లోని పరిశోధనాత్మకత విలక్షణమైనదని, అర్థవంతమైనదని అన్నారు.”మానవుడే మహనీయుడు,” “వేదంలా ఘోషిచే గోదావరి” వంటి స్ఫూర్తిదాయక పాటలను అందించిన ఆరుద్ర గారిని ఉదహరిస్తూ, సినిమా మాధ్యమాన్ని కేవలం వినోద సాధనంగా కాకుండా… స్ఫూర్తిని పంచే సాధనంగానూ మలచవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి మీదా ఉందని హితవు పలికారు.
ఆరుద్ర సాహితీ, పరిశోధనా తృష్ణ భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకమైనదని, యువతరం తెలుగు భాష పరిరక్షణ, పరివ్యాప్తి కోసం నడుం బిగించాలని వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. “భాష ఎంత ముఖ్యమో భావం కూడా అంతే ముఖ్యం. ఈ విషయంలో ఆరుద్ర ఆదర్శప్రాయులు. సాహిత్యాన్ని బతికించడం కోసం ఆరుద్ర తన జీవితాన్నే అంకితం చేశారు.వారికి తోడుగా నిలిచిన వారి శ్రీమతి రామలక్ష్మి గారి స్మృతికి ఈ సందర్భంగా నివాళులు అర్పిస్తున్నాను. కవయిత్రిగా తెలుగు సాహితీ ప్రపంచంలో రామలక్ష్మి గారి ముద్ర ప్రస్ఫుటం. కలం పేరును “రామలక్ష్మి ఆరుద్ర”గా ప్రచురించి… జీవిత భాగస్వామినే గాక సాహితీ భాగస్వామిని అని సగర్వంగా ప్రకటించారు. ఆరుద్ర తినడానికి తిండిలేక నీళ్లు తాగి గడిపిన సందర్భాలు ఉన్నాయి గానీ… రాయలేనని ఆగిపోయిన సందర్భం మచ్చుకు ఒక్కటీ కూడా లేదన్నారు. నడయాడే విజ్ఞాన సర్వస్వంగా, మాట్లాడే గ్రంథాలయంగా పేరు పొందిన ఆరుద్ర సాహితీ, పరిశోధనా తృష్ణ భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకమైనదని వెంకయ్య నాయుడు పేర్కొన్నారు.
