దర్గాను మరింత అభివృద్ది చేస్తా….
జీ న్యూస్ నడికూడ

దర్గా అభివృద్ది కోసం పాటుపడతానని, షరీఫ్ ఉత్సవాలకు వస్తున్న భక్తులకు ఎటువంటి ఇబ్బందులు జరగకుండా చూడాలని పరకాల శాసనసభ్యుడు రేవూరి ప్రకాశ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం నడికూడ మండలం ముస్త్యాలపల్లి గ్రామంలోని మహమ్మద్ ఖాజా ఖాద్రి దర్గా ఉర్సు షరీఫ్ అజాజ్ మదర్ షావలి ఉత్సవాలకు ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. సంప్రదాయ పద్ధతిలో ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు. అనంతరం ఆయన దర్గాకు చాధర్ సమర్పించి, ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… దర్గాకు ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉందని, ఉర్సు షరీఫ్ అజాజ్ మదర్ షావలి ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మతసామరస్యాన్ని కాపాడుతూ అందరికీ సమాన న్యాయం అందేలా చూస్తుందని అన్నారు. పరకాల నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరారు, దర్గా పరిసర ప్రాంతాలను పరిశీలించి, దర్గా అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ముస్తాలపల్లి గ్రామ ప్రాథమిక పాఠశాలకు స్వచ్ఛ ఇవం హరిత్ విద్యాలయ రేటింగ్ రాష్ట్రస్థాయిలో సెలెక్ట్ అయిన సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు కందుకూరి శ్రీనివాస్ ను శాలువాతో సన్మానించారు.

