ఎలక్ట్రానిక్ పరికరాలకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీతో అనుసంధానం
జీ న్యూస్ ఎడ్యుకేషన్
మార్కెట్లోకి వస్తున్న కంప్యూటర్, ఎలక్ట్రానిక్ పరికరాలు ఎక్కువ వేగంతో పని చేస్తాయని, ఇందుకు కారణం వాటికి కృత్రిమ మేధస్సుతో అనుసంధానం చేయడమేనని ఐ.ఐ.టి భువనేశ్వర్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ బొప్పు శ్రీనివాస్ అన్నారు. హుజురాబాద్ మండలం సింగాపూర్ కిట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో గురువారం ఏఐసీటిఈ ప్రాయోజిత “ఏ .ఐ. డ్రివెన్ ఇన్నోవేషన్ ఇన్ కమ్యూనికేషన్స్ అండ్ వి. ఎల్ .ఎస్. ఐ . అండ్ ట్రెండ్స్ ఛాలెంజఎస్” కార్యక్రమంలో అధ్యాపకులకు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాచారము పంపుతున్నప్పుడు, సమాచారం తీసుకుంటున్నప్పుడు ఎలక్ట్రానిక్ పరికరాలు నెట్వర్క్ ఆప్టిమైజేషన్ చేసుకుంటాయని వివరించారు.

రాబోయే 6జి పరికరాలలో ఏఐ ని ఉపయోగిస్తున్నారన్నారు. ఏఐ ని ఉపయోగించి అగ్యుమెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ లు ఎక్కువ సమర్థవంతంగా పనిచేస్తాయన్నారు. పరికరాల పని వేగము గణనీయంగా పెరుగుతుందని, ఏఐ వలన ఇంతకు ముందున్న సమాచార ప్రసరణ లోపాలు, నెమ్మదిత్వము తగ్గి వేగము 40 శాతం వరకు పెరుగుతుందన్నారు. ఇప్పుడు అన్ని పరికరాల్లో, యంత్రాల్లో ఏఐని అనుసంధానం చేస్తున్నారన్నారు. అధ్యాపకులు కొత్త కొత్త సాంకేతిక పరిజ్ఞానం నేర్చుకొని తాము బోధిస్తున్నప్పుడు విద్యార్థులకు సాంకేతిక విజ్ఞానమును పరిచయం చేయాలని సూచించారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కే శంకర్ మాట్లాడుతూ అధ్యాపకులకు విద్యార్థులకు ప్రయోగాలు చేసేందుకు కళాశాలలో తగిన వసతులు ఉన్నాయని వాటిని ఉపయోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగ అధిపతి డాక్టర్ రమేష్, కార్యక్రమ సమన్వయకర్త డాక్టర్ ఎం. శ్యాంసుందర్, అధ్యాపకులు పాల్గొన్నారు.
