చౌటుపల్లిలో సహస్ర ప్రత్యంగిరా మహా మంత్రయజ్ఞం
జీ న్యూస్ కమ్మర్‌పల్లి
నిజామాబాద్ జిల్లా కమ్మర్‌పల్లి మండలం చౌటుపల్లి గ్రామంలోని శ్రీ కోటిలింగేశ్వర స్వామి దేవస్థానంలో మూడు రోజుల పాటు జరగనున్న సహస్ర ప్రత్యంగిరా మహా మంత్రయజ్ఞం భక్తిశ్రద్ధల నడుమ ప్రారంభమైంది. పుష్య పౌర్ణమి, ఆరుద్ర నక్షత్రం సందర్భంగా నిర్వహిస్తున్న ఈ యజ్ఞంలో ప్రాంతం నలుమూలలనుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు. యజ్ఞం శ్రీ శ్రీ శ్రీ జగద్గురు హంపి విరూపాక్ష విద్యారణ్య భారతీ మహాస్వామి ఆశీస్సులతో, శ్రీ శ్రీ శ్రీ సద్గురు మాధవానంద సరస్వతి స్వామి అనుగ్రహంతో ప్రారంభమైంది. కార్యక్రమాన్ని దేవస్థానం ధర్మకర్త భువన గంగా ప్రసాద్ ప్రత్యక్ష పర్యవేక్షణలో నిర్వహిస్తున్నారు. యజ్ఞ ప్రాంగణంలో మంత్రోచ్ఛరణలతో, హోమాలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
చౌటుపల్లి కోటిలింగాల గుట్టలో కొలువైన అమ్మలగన్నయమ్మ శత్రుపరాజిత ప్రత్యంగిరా అమ్మవారి సన్నిధి ఈ యజ్ఞానికి ప్రత్యేక ఆకర్షణ. వేదాలు ప్రత్యంగిరా దేవిని అథర్వణ భద్రకాళి రూపంలో సూచిస్తాయి. పురాణాల ప్రకారం ఆమె త్రిపుర సుందరి కోపశక్తి యొక్క ఆధార రూపమని పురాణ విశ్వాసం. నరసింహి, సింహముఖి అనే పేర్లతో కూడా ప్రసిద్ధి. ప్రత్యంగిర అమ్మవారిని సప్తమాత్రికల మాతృదేవతలలో భాగాంగా చూస్తారు. సింహం ముఖంతో, భగభగమండే కేశాలతో, త్రినేత్రాలతో ప్రత్యంగిరా అమ్మ మనకు దర్శనమిస్తుంది .ఇది ధైర్యం, అపారమైన శక్తికి చిహ్నమని, దుష్ట శక్తులు, మంత్రాలు, శాపాలు, ప్రతికూల శక్తుల నుండి భక్తులను రక్షిస్తుందని నమ్మకం. యజ్ఞంలో పాల్గొన్న భక్తులు కుటుంబ శాంతి, ఆరోగ్యం, అభివృద్ధి కోసం అమ్మవారి ఆశీస్సులు కోరుకున్నారు. యజ్ఞం మూడో రోజు పూర్ణాహుతితో ముగియనుంది. భక్తులందరూ పాల్గొని ప్రత్యంగిరా అమ్మవారి కటాక్షం పొందాలని దేవస్థానం కమిటీ విజ్ఞప్తి చేసింది.

