రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్ కు ఎంపీ వద్దిరాజు వినతిపత్రం అందజేత
జీ న్యూస్ ఖమ్మం
ఖమ్మం రైల్వే స్టేషన్ లో ప్రయాణీకుల సౌకర్యార్థం పలు సూపర్ ఫాస్ట్ రైళ్లకు హాల్టింగ్ సదుపాయం కల్పించాల్సిందిగా రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్ ను శుక్రవారం కలిసి విజ్ఞప్తి చేశారు. కరోనా మహమ్మారి ప్రబలిన సమయంలో రద్దు చేసిన పలు ప్యాసింజర్ రైళ్లను పునరుద్ధరించాలని కోరామన్నారు. ఉత్తరాది రాష్ట్రాలకు వెళ్లే ప్రయాణీకుల సౌకర్యార్థం గయా మాస్, స్వర్ణ జయంతి, జైపూర్ ఎక్స్ ప్రెస్ రైళ్లను ఖమ్మం స్టేషన్ లో నిలిపే విధంగా అధికారులకు వెంటనే తగు ఆదేశాలివ్వాల్సిందిగా చెప్పామన్నారు. స్వామి అయ్యప్ప కొలువైన కేరళలోని శబరిమలకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం ఖమ్మంలో కేరళ ఎక్స్ ప్రెస్ కు హాల్టింగ్ సదుపాయం కల్పించాల్సిందిగా వినతిపత్రంలో పేర్కొన్నామన్నారు. గార్ల రైల్వే స్టేషన్లో శాతవాహన, ఇంటర్ సీటీ రైళ్లను ఆపడంతో పాటు స్టేషన్ అభివృద్ధికి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. కరోనా సమయంలో ఖమ్మం ఉమ్మడి జిల్లాలో రద్దు చేసిన కాజీపేట – విజయవాడ, డోర్నకల్ – భద్రాచలం, కాజీపేట – మణుగూరు, కొల్లాపూర్ ప్యాసింజర్ రైళ్లను పునరుద్దరించాలన్నారు, కాకతీయ ప్యాసింజర్ రైలుకు తడికలపూడి, చీమలపాడు, బేతంపూడి స్టేషన్లలో హాల్టింగ్ సదుపాయం కల్పించాలని వినతి పత్రంలో పేర్కొన్నారు. కాజీపేట-విజయవాడ ప్యాసింజర్ రైలును భక్తుల సౌకర్యార్థం తిరుపతి వరకు పొడిగించాలని, కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని భద్రాచలం రోడ్ రైల్వే స్టేషన్ నుంచి సికింద్రాబాద్ కు ఉదయం పూట మరో రైలును ప్రారంభించేందుకు తగు చర్యలు తీసుకోవలసిందిగా మంత్రిని కోరారు. తన దృష్టికి తెచ్చిన సమస్యల పట్ల రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్ సానుకూలంగా స్పందిస్తూ సంబంధిత అధికారులకు తగు ఆదేశాలిస్తామని హామీ ఇచ్చారన్నారు.
