అయిదు తరాల అపురూప సమ్మేళనం

Must read

అయిదు తరాల అపురూప సమ్మేళనం

ఒక్క వేదికపైకి చేరిన 200 మంది

జీ న్యూస్​ హైదరాబాద్

ఉమ్మడి కుటుంబాలు తగ్గిపోయి విలువలు ప్రశ్నార్థకమవుతున్న ప్రస్తుత తరుణంలో ఇదొక అపురూప సన్నివేశం.‌ ఒకే కుటుంబానికి చెందిన దాదాపు 200 మంది ఒక వేదికపై కలుసుకుని ఆనందానుభూతిని పొందిన సందర్భమిది. పెద్దపల్లి జిల్లా మంథనికి చెందిన కొంతం కిష్టయ్య, అమ్మాయి దంపతుల వారసులు గురువారం హైదరాబాద్ కొండాపూర్ లోని అపర్ణా సెరేన్ కమ్యూనిటీ లో కలుసుకున్నారు. 80 ఏళ్ల వృద్ధులు మొదలుకొని ఆరు నెలల శిశువుల వరకు అయిదు తరాల వారు ఇందులో పాలు పంచుకున్నారు. సామాన్య నేపథ్యం నుంచి మొదలైన ఒక కుటుంబం, కేవలం చదువునే ఆయుధంగా మలుచుకుని ఐదు తరాల సంబరాన్ని జరుపుకోవడం అందరినీ ఆకట్టుకుంటోంది. ఒకప్పుడు ఎన్నో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్న ఈ కుటుంబం, నేడు సమాజంలో పదిమందిని నడిపించే నాయకత్వ స్థానాలకు ఎదగడం విశేషం. ఈ అపురూప కలయికలో నాటి కష్టాలను తలుచుకుంటూ, నేటి విజయాలను చూసి ఆ కుటుంబ సభ్యులు భావోద్వేగానికి లోనయ్యారు. తమ మూలాలను మరువకుండా, విద్య ద్వారా తలరాతను మార్చుకోవచ్చని నిరూపించిన ఈ ఐదు తరాల ప్రయాణం నేటి సమాజానికి ఒక గొప్ప స్ఫూర్తి. పెద్దల ఆశీస్సులు, పిల్లల ప్రగతి కలగలిసిన ఈ వేడుక ఒక అద్భుత దృశ్యంగా నిలిచింది. ఈ సందర్భంగా కుటుంబ వృక్షాన్ని చిత్రరూపకంగా ప్రదర్శించారు.‌ తర్వాత ప్రతి కుటుంబానికి చెందిన వారు పరిచయం చేసుకున్నారు. ఆటపాటలు, చిన్నారుల కళా ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.‌ మంథని ఫ్యామిలీ గ్రూప్ వాట్సాప్ బృందం ఈ కార్యక్రమానికి రూపకల్పన చేసి విజయవంతం చేసింది. రాష్ట్రంలోని అనేక జిల్లాల నుంచి అనేక వ్యయ ప్రయాసలకోర్చి, చలిని కూడా లెక్క చేయకుండా అంతా ఉత్సాహంగా పాల్గొన్నారు. కుటుంబ పెద్దల విలువలు, సభ్యులందరి ఫొటోలు, పరిచయాలతో ప్రత్యేక పుస్తకాన్ని ప్రచురించాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. విదేశాల్లో ఉంటున్న కుటుంబ సభ్యులు ఆన్లైన్ లో పాల్గొన్నారు. ఇలాంటి వేడుకలు ప్రస్తుతం అత్యంత అవసరమని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు.

More articles

Latest article