హుజురాబాద్ గడ్డ రుణం తీర్చుకుంటా
.. ఆదర్శ నియోజక వర్గంగా తీర్చిదిద్దుతా
ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్
జీ న్యూస్ హుజూరాబాద్

రాజకీయంగా జన్మనిచ్చి, ఉన్నత స్థాయిలో ఉండటానికి మూల కారణమయిన హుజురాబాద్ గడ్డ రుణం తీర్చుకుంటానని టిపిసిసి ఉపాధ్యక్షుడు, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అన్నారు. శనివారం హుజూరాబాద్ నియోజకవర్గంలో పలు కార్యక్రమాలలో పాల్గొన్నారు. హుజూరాబాద్ చేరుకున్న ఆయనను కాంగ్రెస్ నాయకులు పెద్ద సంఖ్యలో హాజరై స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హుజురాబాద్ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చి దిద్దుతానన్నారు. పార్టీలకతీతంగా తన ఎమ్మెల్సీ నిధులను ఆయా గ్రామాలకు కేటాయించి అబివృద్దికి సహకారం అందిస్తానన్నారు. బీఆర్ఎస్, బిజెపి పార్టీలు రెండు ఒక్కటై కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఓడించడానికి భారీ మొత్తంలో ఖర్చు చేసి రాజకీయం చేశారని, అయినా కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాలను గెలుచుకుందన్నారు. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించిన రాబోయే రోజుల్లో హుజురాబాద్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. నియోజకవర్గ ప్రజలకు మెరుగైన వైద్యం అందించడంతో పాటు ముఖ్యమంత్రి సహాయనిధి సీఎం ఫండ్ , ఎల్ఓసిల ద్వారా సహాయనిధి ఇప్పించేందుకు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను చూసి చాలామంది పార్టీలో చేరడానికి సిద్దంగా ఉన్నారన్నారు. వారికి కాంగ్రెస్ పార్టీ స్వాగతం పలుకుతుందని పేర్కొన్నారు. మీడియా మిత్రులతో ప్రెస్ క్లబ్లో సమావేశం జరిపి నియోజకవర్గ పరిస్థితులు తెలుసుకున్నారు. అనంతరం ఇల్లందకుంట మండల కేంద్రంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు రావడంతో ఆలయ పూజారులు శేషం రామాచార్యులు వంశీధరాచార్యులు పూర్ణకుంభంతో మేళతాళాల మధ్య ఘన స్వాగతం పలికారు. దేవాలయంలో పూజలు నిర్వహించిన అనంతరం హుజురాబాద్, వీణవంక ,ఇల్లందకుంట, జమ్మికుంట మండల కేంద్రాలలోని గ్రామాలలో గెలిచిన సర్పంచ్లను సన్మానించారు. ఈ కార్యక్రమంలో పిసిసి మెంబర్ పత్తి కృష్ణారెడ్డి, దేవాలయ చైర్మన్ ఇంగిలే రామారావు, నాయకులు, జైపాల్ రెడ్డి, పుష్పలత, పొన్నగంటి మల్లయ్య, రాజేశ్వరరావు, రంజిత్, సలీం తో పాటు తదితరులు పాల్గొన్నారు.
