Power Demand | వర్షాకాలంలోనూ పెరుగుతోన్న విద్యుత్తు డిమాండ్‌..

Must read

Power Demand | సాధారణంగా వానకాలంలో విద్యుత్తు వినియోగం తగ్గే పరిస్థితి ఉంటుంది. కానీ ఈ ఏడాది రాష్ట్రంలో పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. గతేడాది ఇదే కాలంతో పోల్చితే రోజుకు 20–30 మిలియన్‌ యూనిట్ల మేరకు విద్యుత్తు వినియోగం అధికమైంది. జూలై 16న ఈ సీజన్‌లోనే గరిష్ఠంగా 15,443 మెగావాట్ల పీక్‌ డిమాండ్‌ నమోదు కాగా, గత ఏడాది జూలై 31న 13,541 మెగావాట్లు మాత్రమే ఉంది.పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చేందుకు ప్రభుత్వం సీజీఎస్‌ (కేంద్ర విద్యుత్‌ స్టేషన్లు) మరియు మార్కెట్‌ ద్వారా విద్యుత్తును కొనుగోలు చేస్తోంది. ఈ నెల 18న 116 మిలియన్‌ యూనిట్లు, వారంలో గరిష్ఠంగా 95 మిలియన్‌ యూనిట్లు, కనిష్ఠంగా 70 మిలియన్‌ యూనిట్లను కొనుగోలు చేసి అవసరాలు తీర్చారు.

నవీన్‌ మిట్టల్‌ సమీక్ష

విద్యుత్తు డిమాండ్‌ పెరుగుదల నేపథ్యంలో ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్‌మిట్టల్‌ సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి పీక్‌ డిమాండ్‌ 14.05 శాతం పెరిగిందని తెలిపారు. వర్షాలు పడుతోన్నా వినియోగం పెరగడం, వరినాట్లు జోరుగా సాగడంతో డిమాండ్‌ మరింత పెరిగే అవకాశముందని వివరించారు. సీఎండీ స్థాయి నుంచి ఫీల్డ్‌ సిబ్బంది వరకు అందరూ అప్రమత్తంగా ఉండాలని, వర్షాకాలంలో ఎలాంటి అంతరాయం లేకుండా విద్యుత్తు సరఫరా నిరవధికంగా కొనసాగించాలన్న సూచనలు చేశారు.

More articles

Latest article