వెయ్యి స్తంభాల గుడిలో బతుకమ్మ ఉత్సవాలు ప్రారంభం
కొండా సురేఖ బతుకమ్మ పాటకు సీతక్క కోరస్.
వరంగల్ జీ న్యూస్
హన్మకొండ వేయిస్తంభాల ఆలయంలో బతుకమ్మ సంబరాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు జూపల్లి, పొంగులేటి, కొండా సురేఖ, సీతక్క బతుకమ్మ ఉత్సవాలు ప్రారంభించారు. రాష్ర్టంలో బతుకమ్మ పండుగను ఆనవాయితీగా ఓరుగల్ల నుంచి మొదలయ్యే సంబురాలను ప్రారంభించింది. తొమ్మది రోజుల పాటు నిర్వహించే కార్యక్రమాలను రూపొందించింది. ఓరుగల్లులో మొదలైన బతుకమ్మ వేడుకలు ఈ నెల 30న హైదరాబాద్ ట్యాంక్‌బండ్ వద్ద ముగియనున్నాయి. పూల పండుగకు భారీగా మహిళలు తరలివచ్చారు. బతుకమ్మ సంబరాల నేపథ్యంలో అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు.
ప్రకృతి పండుగ బతుకమ్మ
ప్రకృతి పండుగ బతుకమ్మని.. మహిళలు ఆర్థికంగా, సామాజికంగా ఎదగాలని కోరుకుంటున్నాని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని మహిళలు దీవించాలని ఆయన ఆకాంక్షించారు.
తెలంగాణ ఉద్యమంలో అందరినీ ఏకం చేసింది బతుకమ్మ పండుగ అని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ‘గతంలో మన సంస్కృతిని గుర్తించలేదు, ధ్వంసం చేశారు. బతుకమ్మకు రెండు వందల ఏళ్ల చరిత్ర ఉంది’ అని జూపల్లి తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వాన్ని మహిళలు దీవించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కోరారు. మహిళలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా బతుకమ్మ ఉత్సవాలు నిర్వహిస్తోందని తెలిపారు.
ఏడాదికొకసారి వచ్చే బతుకమ్మకు చాలా చరిత్ర ఉందని మంత్రి సీతక్క అన్నారు. ‘కాకతీయుల కాలం నుంచి బతుకమ్మ పండుగ జరుపుకుంటున్నాం. చెరువులకు మొక్కుకునే ఆనవాయితీ మనది. ఆడబిడ్డలు కష్టసుఖాలు పంచుకునే సందర్భం బతుకమ్మ. మన పండుగలకు సైంటిఫిక్ రీజన్ ఉంది. పూర్వీకులు ఇచ్చిన ఆచారాలు, సంప్రదాయాలు కాపాడుకుందాం’ అని సీతక్క అన్నారు.
తెలంగాణ పచ్చగా ఉండాలని మహిళలు దీవించాలని మంత్రి కొండా సురేఖ కోరారు. కనివిని ఎరుగని రీతిలో బతుకమ్మ సంబరాలు నిర్వహిస్తున్నామని మంత్రి చెప్పారు. ఈ సందర్భంగా కొండా సురేఖ ‘చిత్తూ చిత్తూల బొమ్మ’ అంటూ బతుకమ్మ పాట పాడగా.. మంత్రి సీతక్క, ఎంపీ కావ్య, మేయర్ గుండు సుధారాణి, గద్దర్ కూతురు వెన్నెల, మహిళలు కోరస్ ఇచ్చారు.
