
సొంత గూటికి మాజీ కౌన్సిలర్ భీమగోని సురేష్
జీ న్యూస్ హుజూరాబాద్
హుజురాబాద్ నియోజకవర్గంలోని హుజురాబాద్ మున్సిపాలిటీకి చెందిన మాజీ కౌన్సిలర్, ముఖ్య నాయకుడు భీమగోని సురేష్ తన సొంత పార్టీ భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) లోకి చేరారు. శనివారం ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పార్టీ కండువా కప్పి భీమగోనిని బిఆర్ఎస్లోకి ఆహ్వానించారు. తెలంగాణ ఉద్యమ కాలంలో చురుకుగా ఉండి టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుండి పట్టణంలో ముఖ్య నాయకుడుగా ఎదిగాడు. హుజూరాబాద్ మున్సిపల్ కౌన్సిలర్‌గా విజయం సాదించాడు. అనంతరం పార్టీలో జరిగిన పరిణామాల కారణంగా కొద్ది కాలంగా స్తబ్దుగా ఉంటున్నాడు. స్థానిక నాయకులు సూచన మేరకు తిరిగి పార్టీలో చేరాడు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పాలనలో తెలంగాణ రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదని విమర్శించారు. రాష్ట్ర ప్రజలు చెల్లిస్తున్న పన్నుల మొత్తాన్ని కూడా రాష్ట్ర అభివృద్ధికి కేటాయించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారంటీలు పూర్తిగా అమలుకావడం లేదని విమర్శించారు. గ్యారంటీల పేరుతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, హామీలను విస్మరించిందని ఆరోపించారు. రైతులు, పేదలు, మహిళలు, యువత, అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలతో తీవ్ర అసంతృప్తిలో ఉన్నారని తెలిపారు. తెలంగాణ రైతులకు కనీసం యూరియా సరఫరా చేయలేని స్థితికి కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకువచ్చాయని, రెండు ప్రభుత్వలతో తెలంగాణకు ఎలాంటి న్యాయం జరగలేదని స్పష్టం చేశారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీకి ప్రజలు గట్టిగా అండగా నిలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో బిఆర్ఎస్ తన ఆధిపత్యాన్ని కొనసాగించిందని, రాబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా హుజురాబాద్ నియోజకవర్గంలోని రెండు మున్సిపాలిటీలను బిఆర్ఎస్ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన నాయకుడు భీమగోని సురేష్ మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీతోనే తెలంగాణ రాష్ట్రం సంపూర్ణంగా అభివృద్ధి చెందుతుందన్నారు. వ్యక్తిగత కారణాల కారణంగా కొంత కాలం స్తబ్దుగా ఉన్నానని, ఇప్పుడు చురుకుగా ఉంటూ తిరిగి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు తన వంతు కృషి చేస్తానన్నారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి నియోజకవర్గంలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు, రైతుల మన్ననలు పొందుతున్నారన్నారు. ప్రజల తరఫున ప్రభుత్వాన్ని నిరంతరం నిలదీస్తూ అభివృద్ధికి కృషి చేస్తున్న నాయకుడితోనే హుజురాబాద్ అభివృద్ధి సాధ్యమని విశ్వసించి పార్టీ కండువా కప్పుకున్నానని చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి బండ శ్రీనివాస్, నాయకులు కొలిపాక శ్రీనివాస్, తాళ్లపల్లి శ్రీనివాస్, కల్లెపల్లి రమాదేవి, దిల్ శ్రీను, బూసారపు వెంకటేశ్వర్లు, విరుపాక్షం, ప్రభావతి రెడ్డి లతో పాటు పలువురు బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
