జిఎస్టి సంస్కరణలు నరేంద్ర మోదీ దార్శనిక దృష్టికి నిదర్శనం
కేంద్ర మంత్రి బండి సంజయ్
జీ న్యూస్ హుజురాబాద్:
జిఎస్టి సంస్కరణలు నరేంద్ర మోదీ దార్శనిక దృష్టికి నిదర్శనమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. శుక్రవారం నాడు న్యూఢిల్లీలోని జంతర్ మంతర్, రైసినా రోడ్లో గల కేంద్ర మంత్రి అదికారిక నివాసంలో తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్ రావును శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమల్లోకి తీసుకువచ్చిన జీఎస్టీ సంస్కరణల పై సామాజిక న్యాయ దృష్టికోణంతో వకుళాభరణం రచించిన బుక్‌ను డిల్లీలో ఆవిష్కరించారు. దీనిని పురస్కరించుకొని ఆయనను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ, జిఎస్టి సంస్కరణలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనిక దృష్టికి నిదర్శనమన్నారు. అభివృద్ధి, సామాజిక న్యాయ దృష్టితో వకుళాభరణం రచించిన ఈ గ్రందం ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ పుస్తకం అనేక కోణాల్లో జీఎస్టీ సంస్కరణల ఆకాంక్షను నిబద్ధతతో చర్చించిందన్నారు. ఈ సంస్కరణలు కేవలం పన్ను తగ్గింపులకే పరిమితం కాకుండా, ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలలో ఎంతగా ఉపయుక్తమో వకుళాభరణం లోతైన అధ్యయనంతో స్పష్టంగా విశ్లేషించి రచించారన్నారు. అలాగే, ఇలాంటి రచనలు మరింతగా రావాల్సిన అవసరం ఎంతో ఉందని మంత్రి బండి సంజయ్ పేర్కొన్నట్లు వకుళాభరణం కృష్ణమోహన్ రావు తెలిపారు. వకుళాభరణం రచించిన పుస్తకాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్, కిషన్ రెడ్డిల చేతుల మీదుగా ఆవిష్కరించడం సముచితమని మంత్రి బండి సంజయ్ అభిప్రాయపడ్డారని వకుళాభరణం కృష్ణమోహన్ రావు వెల్లడించారు.

