ప్రియురాలిని దారుణంగా హతమార్చిన ప్రియుడు
టీ స్టాల్ నడుపుకుంటున్న మహిళ దారుణ హత్య
జీ న్యూస్ బైంసా
టీ స్టాల్ నడుపుకుంటు జీవనం సాగిస్తున్న మహిళ దారుణ హత్యకు గురైన సంఘటన కలకలం రేపింది. తనతో సహజీవనం చేస్తూ మరో వ్యక్తితో చనువుగా మాట్లాడుతుందనే అనుమానంతో ఆమె ప్రియుడు టీ స్టాల్లోనే సదరు మహిళను రాడ్డుతో దాడి చేసి, కత్తితో పొడిచి హతమార్చాడు. ఈ దారుణ ఘటన నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో జరిగింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. భైంసా మండలం కుంసర గ్రామానికి చెందిన అశ్విని(30)కి వివాహం అయ్యి, బర్తలో మనస్పర్దాల కారణంగా విడాకులు తీసుకొని ఒంటరిగా ఉంటుంది. ఈక్రమంలో ఆమెకు భైంసా పట్టణంలోని అంబేద్కర్ నగర్ కు చెందిన ఇప్పరే నగేష్ తో పరిచయం ఏర్పడింది. అది అక్రమ సంబంధానికి దారితీసి, ఇద్దరు కలిసి సహజీవనం చేస్తున్నారు. అశ్విని జీవనోపాధి కోసం భైంసా పట్టణంలోని సంతోషిమాత ఆలయం పక్కన నగేష్ టీ స్టాల్ పెట్టించాడు. ఈ మద్య కాలంలో అశ్విని మరో వ్యక్తితో తరచూ ఫోన్ మాట్లాడటం, చాటింగ్ చేస్తుందని నరేష్ అనుమానించాడు. దీనిపై తరుచు గొడవలు పడుతున్నారు. ఆమెను ఎన్నిసార్లు ప్రవర్తన మార్చుకోవాలని హెచ్చరించినా పట్టించుకోవటం లేదనే కక్షతో సోమవారం ఉదయం టీ స్టాల్లో ఉన్న ఆమెపై రాడ్డుతో దాడి చేసి, కత్తితో విచక్షణ రహితంగా పొడిచాడు. తీవ్రంగా గాయపడిన అశ్విని రక్తపుమడుగులో కొట్టుమిట్టాడుతూ స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయింది. ప్రియురాలిని హత్య చేసిన నగేష్ పారిపోకుండా ఆమె మృతదేహం పక్కన కూర్చుండిపోయాడు. దీనిని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో, హుటాహుటిన ఘటనా స్థలానికి వచ్చిన బైంసా పోలీసులు నగేష్ ను అదుపులోకి తీసుకున్నారు. అశ్విని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, హత్యకు గల కారణాలపై నగేష్ తో పాటు స్థానికులను పోలీసులు విచారిస్తున్నారు.


